ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ సేవలు అందించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం అందించారు. అయితే కేంద్రంలో ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వల్లే రాజీనామా చేసినట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటే అవకాశాలు ఉన్నాయని, అందుకే కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వదిలినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ పెద్దల పద్దతులు నచ్చక రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కానీ నిరాశే మిగిలింది. అయినా జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ చురుగ్గా పాల్గొనేవారు. అయితే టీఆర్ఎస్ ఆధిపత్యంపై పోరాటం కోసం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థాయిలో పోరాటం చేయడం లేదనే అసంతృప్తి ఏర్పడింది. రేవంత్ రెడ్డి వంటి నాయకుడు కేసీఆర్ ప్రభుత్వంపై మాటల దూకుడు ప్రదర్శిస్తున్నా.. సొంత పార్టీల నేతలే తప్పు పడుతున్నారనే వాదన వినిపిస్తోంది. పార్టీల నాయకుల మధ్యనే యూనిటీ లేదని.. అందుకే పార్టీ నుంచి రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.
కాగా, అధికార ప్రభుత్వం మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ఆయన గట్టి మద్దతు తెలుపుతూ వచ్చారు. పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. ఇలా అన్ని కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డికి ధైర్యంగా నిలబడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. రాజీనామా చేయడంతో రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బె తగిలింది. రేవంత్‌కు మద్దతుగా ఉన్న వాళ్లు రాజీనామా చేయడం, వేరే పార్టీలో చేరడం జరుగుతోంది.