స్వర్గం, నరకం ఎక్కడుంటాయో చెప్పే అద్భుతమైన కథ..

-

ఒక ఊరిలో ఉన్న అమ్మాయికి స్వర్గం, నరకం చూడాలని ఆశగా ఉంటుంది. ఒకరోజు ఉదయం పూట భగవంతుడు ప్రత్యక్షమై స్వర్గం, నరకం చూస్తావా అని అడుగుతాడు. దానికి అవును, చూస్తాను అంటుంది. సరే అని చెప్పి తనతో పాటు తీసుకెళతాడు. నదులు, సముద్రాలు దాటి అవతలికి వెళ్ళిపోతూ మేఘాల మీదకి పోతూ ఒకానొక చోట ఆగుతారు. అక్కడ పెద్ద భవంతి వాళ్ల కళ్ళ ముందు కనిపిస్తుంది. గాలి కూడా లేని ఆ ప్రదేశంలో భవంతి ఎలా నిలబడిందో ఆమెకి అర్థం కాలేదు.

ఆ భవంతిలోకి వెళ్ళమని అక్కడే స్వర్గం, నరకం ఉంటాయని చెప్తాడు. ఆ భవంతిలోకి ప్రవేశించగానే పెద్ద డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. దాని ముందు వేసిన కుర్చీల్లో కొందరు మనుషులు కూర్చున్నారు. టేబుల్ మీద పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళ ముఖాల్లో సంతోషం లేదు. కారణం వాళ్ళ కాళ్ళు కట్టివేయబడి ఉన్నాయి. టేబుల్ కి వాళ్ళకి దూరం ఎక్కువగా ఉంది. టేబుల్ మీద ఆహార పదార్థాలు చేతికి అందడం లేదు. అది చూసిన అమ్మాయి ఇదేనా నరకం అని తనతో పాటు వచ్చిన దేవుడిని ప్రశ్నించింది. దేవుడు అనును అన్నాడు.

స్వర్గం చూపించమంది. దేవుడు అదే భవంతిలోని మరో గదికి తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా పెద్ద డైనింగ్ టేబుల్, దాని మీద పంచభక్ష పరమాన్నాలు, అవి చేతికి అందకుండా దూరంలో ఉన్న మనుషులు. వాళ్ళ కాళ్ళు కట్టివేయడి ఉన్నాయి. కానీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే పక్కనే ఉన్న చిన్నపాటి కర్ర సాయంతో ఒకరికొకరు ఆహారం తినిపించుకుంటున్నారు. స్వర్గం అంటే ఇదే అన్నాడు దేవుడు.

స్వర్గం, నరకం అనేవి నీలోనే ఉంటాయి. అవతలి వారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావనేది స్వర్గంలో ఉన్నావా? నరకంలో ఉన్నావా అనేది నిర్ణయింపబడుతుంది. అవకాశాలన్నీ అందరికీ ఒకేలా ఉంటాయి. వాటిని నువ్వెలా వినియోగించుకుంటావన్నదే ముఖ్యం. స్వర్గం చేసుకోవాలన్నా, నరకం చేసుకోవాలన్నా నీమీదే ఆధారపడి ఉంటుంది. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.

Read more RELATED
Recommended to you

Latest news