విదేశీ పౌరసత్వం కేసు విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెలి చెన్నమనేని రమేశ్ వ్యవహారం చివరి దశకు వచ్చిన్నట్లు కనిపిస్తోంది. జర్మనీ పౌరసత్వం గల రమేశ్..గత మూడు ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉంటూ..అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండటం తక్కువ. అదే సమయంలో ఈయన విదేశీ పౌరసత్వంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆది శ్రీనివాస్..ఎప్పుడో కోర్టుకు ఎక్కారు. దీనిపై వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇదే క్రమంలో తాజాగా రమేశ్‌కు రెండు పౌరసత్వాలు ఉన్నాయన్న కేసుపై వాదనలు ముగిశాయి. ఇక తీర్పుని తర్వాత వెల్లడిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. రమేశ్ జర్మనీ పౌరసత్వం ఉండగానే భారత పౌరసత్వాన్ని పొందారన్న ఫిర్యాదు మేరకు కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీన్ని సవాలు చేస్తూ.. రమేశ్ తరఫున సీనియర్ న్యాయవాది వై రామారావు వాదన వినిపించారు. జర్మనీ పాస్‌పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదని వాదించారు. దీంట్లో రాజకీయం కోణం ఉందని చెప్పారు.
కేంద్రం తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎ్‌సజీ) టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. రమేశ్..ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్- ఓసీఐ కార్డును కలిగి ఉన్నారని, భారత పౌరులు, ఓసీఐ కార్డు కలిగిన విదేశీ పౌరుల హక్కులు వేర్వేరుగా ఉంటాయని, ఓసీఐ కార్డు కలిగిన వ్యక్తులకు ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు గానీ, చట్టసభల్లో సభ్యులుగా కొనసాగడానికి గానీ అర్హత లేదని వాదించారు.
అటు ఆది శ్రీనివాస్ తరుపు న్యాయవాది సైతం.. రెండు పౌరసత్వాలు కలిగిన రమేశ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ అటు ప్రజలను, ఇటు కోర్టులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇలా రెండువైపులా నుంచి ఎమ్మెల్యే రమేశ్‌కు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. ఈ క్రమంలో కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. త్వరలోనే వెలువడే తీర్పుతో చెన్నమనేని పౌరసత్వం కథ ముగింపుకు రానుంది. అయితే తీర్పు ఎలా వచ్చినా సరే ఈయనకు ఈ సారి టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కడం కష్టమని తెలుస్తోంది..టికెట్ దక్కినా సరే వేములవాడలో గెలుపు కష్టమని తెలుస్తోంది.