పార్టీకి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిర్పూర్ కాగజ్‌నగర్ కాంగ్రెస్ ఇన్చార్చి రావి శ్రీనివాస్‌కు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ఓ మీడియా సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేసినందుకు గాను పార్టీ క్రమశిక్షణ కమిటీ, టీపీసీసీకి కొందరు నేతలు రావి శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. అలాగే.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో INC పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా రావి శ్రీనివాస్ పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.