వైఎస్సార్ ఫ్యామిలీలో కుటుంబసభ్యుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య ఆస్తుల వివాదం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ సీఎం జగన్, ఆయన భార్య భారతి పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై NCLTలో పిటిషన్ వేశారు. షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్, భారతి పిటిషన్ ఫైల్ చేసినట్లు సమాచారం.
కంపెనీ అభివృద్ధి కోసం తాము కృషి చేశామని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2019 ఆగస్ట్ 21 ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని.. కానీ, పలు కారణాలతో అది సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు వాటిని విత్ డ్రా చేసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.దీంతో వివాదం చెలరేగింది. తన చెల్లి పేరుతో ఆరోజు షేర్లు ఇచ్చేందుకు ఓకే చెప్పామని పిటిషన్‌లో జగన్ వివరణ ఇచ్చారు.
ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అన్యాయంగా షేర్లను షర్మిల మార్చుకునే ప్రయత్నం చేసిందని.. అందుకే వాటిని విత్ డ్రా చేయాలని జగన్, భారతి పిటిషన్‌లో వివరించారు. కంపెనీలో తమకు 51 శాతం వాటా ఉందని, అదే డిక్లేర్ చేయాలని వినతి చేశారు.కాగా, జగన్ పిటిషన్‌పై నవంబర్ 8న విచారణ జరగనుంది.