వైఎస్ జగన్ అవినీతి వల్లనే విద్యుత్ భారాలు రూ.1,29,000 కోట్లు పెరిగాయని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాల కారణంగా విద్యుత్ చార్జీలు పెరిగాయన్నారు. 22.5 మిలియన్ యూనిట్ల కొరత ఉన్న రాష్ట్రాన్ని 2019 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది వైసీపీ ప్రభుత్వానికి నాటి టీడీపీ ప్రభుత్వం అప్పగించిందన్నారు.
2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పై రూ.35వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపడమే కాకుండా రూ.1.20 లక్షల కోట్ల నష్టాన్ని విద్యుత్ శాఖలో తెచ్చి పెట్టారన్నారు. గుట్టు చప్పుడు కాకుండా డిస్కమ్ ల ద్వారా ప్రజలపై భారం వేయండి అని ఈఆర్సీకీ ప్రతిపాదనలు పంపారన్నారు. సాధారణంగా ఈఆర్సీకి పంపిన 90 రోజుల్లోపు ట్రూప్ ఆప్ చార్జీలు ఆమోదం పొందాలన్నారు. 2024 మే వరకు చార్జీలను వాయిదా వేస్తూ వచ్చారన్నారు.