వర్షాకాలం అంటే పంటలకు మంచి కాలమే కానీ.. మనుషులకు, మూగజీవులకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. రోడ్డుపై వెళ్లేప్పుడు ఏ గుంతలో పడతామే తెలియదు. వరద నీరు ఎటునుంచి ముచ్చేత్తుందో తెలియదు. పిల్లల్ని కాపాడుకోవాలి. అటు మూగజీవులపైనే ఆధారపడి జీవించే వాళ్లు వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మధ్య కరెంట్‌షాక్‌తో గేదలు మృతి చెందే వార్తలను తరచూ వింటున్నాం. వర్షాకాలంలో పశువులు వ్యాధుల బారిన పడకుండా యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.. అవేంటంటే..
కలుషిత నీరు, ముసురుకునే ఈగలు, కొత్తగా మొలిచే పచ్చిక పశువుల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
పశువులను విద్యుత్తు స్తంభాలు, తీగలకు దూరంగా ఉంచాలి.
పాక పరిసర ప్రాంతాల్లో మురుగు, పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలి. వాటి ద్వారా విష కీటకాలు, జంతువులు బారిన పశువులు పడే అవకాశం ఉంది.
వరదల కారణంగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వాగులు, నదీ పరీవాహక ప్రాంత పశుపోషకులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
గడ్డి, దాణా తడవకుండా నిల్వ చేసుకోవాలి. బూజుపట్టిన గడ్డి తింటే పశువులు అస్వస్థతకు గురవుతాయి. ఎందుకు పారేయడం అని పాడైన గడ్డిని ఎట్టిపరిస్థితుల్లో పశువులకు వేయవద్దు.
అధికశక్తిని ఇచ్చే జొన్నలు, సజ్జలు, రాగులు, ఉలవలను ఆహారంగా ఇస్తూ రక్షిత తాగునీటిని సరిపడా అందిస్తుండాలి..
పాక చుట్టూ సున్నం, బ్లీచింగ్ చల్లితే వ్యాధులను వ్యాప్తి చేసే నత్తలు, ఇతర కీటకాలను నిరోధించవచ్చు.
పచ్చగడ్డితో పాటు, వరి గడ్డి, సమీకృత దాణా, రోజూ 50 గ్రాముల మినరల్ మిక్చర్ పెట్టడం తప్పనిసరి.
చల్లగాలులు, దోమలు, ఈగల కారణంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. అందుకే పాకల చుట్టూ పరదాలు కట్టాలి. దోమల నివారణకు రాత్రి పూట వేప ఆకుతో పొగ పెట్టాలి.
గొర్రెలు, మేకలకు నీలి నాలుక వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. అది రాకుండా టీకా వేయించాలి. సమీపంలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో ఉచితంగా టీకాలు వేస్తారు. యజమానులు జీవాలకు ఈ టీకా తప్పనిసరిగా వేయించాలి.