ఆర్ఎస్ఎస్‌ని వ్యతిరేకించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, ఆ సంస్థను పొగిడారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంస్థాగత విస్తరణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని చూసి నేర్చుకోవాలని ఆ పార్టీ యూత్ కార్యకర్తలకు సూచించారు.
మంగళవారం మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో నీట్ పేపర్ లీకులపై జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ” ఆర్ఎస్ఎస్ తమకు బద్ధ ప్రత్యర్థి అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోండి. వారు మైండ్ గేమ్ ఆడుతారు. వారు ఎప్పుడూ నిరసన చేయరు, ప్రదర్శనలు చేయరు, ఎప్పటికీ వారు లాఠీఛార్జ్‌లను ఎదుర్కోరు, జైళ్లకు వెళ్లరు అని అన్నారు.కానీ వారు మనల్ని జైలుకి పంపుతారు” అని దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అట్టడుగు స్థాయిలో సంస్థాగత నెట్వర్క్ లేకుంటే నిరసనలు ప్రభావంతంగా ఉండవని ,బూత్ నుంచి జిల్లా వరకు మూడు స్థాయిల్లో ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. ”ఆర్ఎస్ఎస్ సాధారణంగా మూడు విషయాలపై దృష్టిపెడుతుంది. కరపత్రాలను పంపిణీ చేస్తుంది. చర్చలు నిర్వహిస్తుంది. చివరకు ఉద్యమాన్ని నిర్మిస్తుంది. మీరు వారితో పోరాడాలంటే, వారి సొంత ఆటలో వారిని ఓడించాలి. శారీరకంగా కాదు మేధోపరంగా ఆట సాగాలి” అని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యనిర్వహణ మరియు ప్రచారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.