కూలి పనులకు వెళ్తున్నామని చెప్పి వెళ్లిన వారు పదిహేను రోజుల తర్వాత బావిలో డెడ్ బాడీలుగా తేలారు.ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామంలో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ జిల్లా జునాపానీ ప్రాంతానికి చెందిన వైద్యనాథ్ భాత్రా(25), హరిసింగ్ మజ్(30) కొన్ని రోజుల కిందట పైడి గుమ్మల సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో కూలీ పనులు చేసేందుకు వచ్చారు.
ఈనెల 10న వారు పైడి గుమ్మలకు వెళ్తున్నామని తోటి కూలీలతో చెప్పారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో వర్కర్స్ సూపర్వైజర్ పంకజ్ తివారీ కుటుంబీకులు, ఇతర ప్రాంతాల్లో ఆరా తీయగా ఎలాంటి ఆచూకీ లభించలేదు.దీంతో ఆయన ఈనెల 13న స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు ఫైల్ అయ్యింది. గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో దుర్వాసన రావడంతో స్థానికులు నిన్న పోలీసులకు సమాచారం ఇవ్వగా.. క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కాగా, వీరిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్యచేసి అందులో పడేశారా? అనేది తెలియాల్సి ఉంది.