కరోనా మహమ్మారి వల్ల దేశ ప్రజల ఆర్థిక స్థితి అంత బాగా ఏమీ లేదు. ఈ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు తమ పిల్లల చదువుల కోసం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అందుకుగాను పెద్ద ఎత్తున ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. అయితే ఆ కాలేజీ మాత్రం కరోనా కష్టకాలంలోనూ పేద విద్యార్థుల పట్ల జాలి చూపిస్తోంది. అడ్మిషన్ ఫీజు కింద కేవలం రూ.1 మాత్రమే ఫీజును తీసుకుంటోంది. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల ధనదాహానికి చెంప పెట్టులా వ్యవహరిస్తోంది.
పశ్చిమబెంగాల్ లోని నైహతిలో ఉన్న రిషి బంకిమ్ చంద్ర కాలేజీలో యూజీ కోర్సుల అడ్మిషన్ ఫీజు సహజంగానే రూ.3500 నుంచి రూ.11వేల వరకు ఉంటుంది. అయితే ఈసారి మాత్రం వారు కేవలం రూ.1 మాత్రమే అడ్మిషన్ ఫీజు తీసుకుంటున్నారు. కరోనాతోపాటు అక్కడ ఇటీవల వచ్చిన ఆంఫన్ తుఫాను ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఇక ఆ కాలేజీకి వచ్చే విద్యార్థుల్లో చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందినవారే. అందువల్లే రూ.1 మాత్రమే అడ్మిషన్ ఫీజు తీసుకుంటున్నామని కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజిబ్ కుమార్ సాహా మీడియాకు తెలిపారు.
అయితే ఆ కాలేజీలో అడ్మిషన్ పొందేందుకు నింపాల్సిన ఆన్‌లైన్ ఫాం ఖరీదును ఎప్పటిలాగే రూ.60గా నిర్ణయించారు. ప్రస్తుతం అందులో 21 యూజీ కోర్సులను అందిస్తుండగా.. ఆ మొత్తం కోర్సులకు రూ.1 మాత్రమే అడ్మిషన్ ఫీజుగా నిర్ణయించారు. అలాగే అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. ఆగస్టు 17 తరువాత మెరిట్ ఆధారంగా అడ్మిషన్లను కేటాయిస్తారు.