బిహార్ ఎన్నికలు ముగిశాయి. అక్కడ బీజేపీ విజయం సాధించి.. అతి పెద్ద రెండో పార్టీగా అవతరించింది. అయితే.. బీజేపీ నాయకు లు ఎప్పుడు ఏం చేసినా.. ఎక్కడ ఎలా ఉన్నా.. చిన్నపాటి చీమ కుట్టినా.. స్పందించే టీడీపీ అదినేత చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం మౌనంగా ఉన్నారు. ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరికీ ఫోన్ కూడా చేయలేదు. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేచర్చ జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో చంద్రబాబు ఏం మాట్లాడినా.. ఇట్టే వైరల్ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆయన మౌనంగా ఉండడం కూడా వార్తగానే మారడం గమనార్హం.
ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనే విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. లేకపోతే.. ఒకవైపు కరోనా దూకుడు.. మరోవైపు నిరుద్యోగం.. పైగా.. అన్ని విషయాల్లోనూ మోడీ సర్కారువిఫలం కావడం.. నితీష్‌పై ప్రజల్లో ఏవగింపు రావడం.. వంటి పరిణామాలతో రాష్ట్రంలో అధికార మార్పు ఖాయమని అందరూ అనుకున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీతో కూడిన నితీశ్‌కు ఓటమి ఖాయమని క్షేత్రస్థాయిలో అంచనాలు కూడా వచ్చాయి.
ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడించాయి. దీంతో ఆర్జేడీ కూటమి గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పుంజుకుని ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయితే, ఈ క్రమంలోనే అనేక అనుమానాలు తెరమీదికి వచ్చాయి. ప్లూరల్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని.. తమకు పడాల్సిన ఓట్లు అన్నీ.. కూడా బీజేపీకి దఖలు పడ్డాయని ఆరోపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చకు దారితీసింది. దీంతో చంద్రబాబు ఎటూ మాట్లాడలేక మౌనం పాటించారనే విశ్లేషణలు వస్తున్నాయి.
వాస్తవానికి ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని 2019 ఎన్నికల్లో ఆయనే తెరమీదకి తెచ్చారు. తన సీట్లు, ఓట్లు గల్లంతయ్యాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే విషయం చర్చనీయాంశంగా మారితే మాత్రం సైలెంట్ అయ్యారు. దీంతో బీజేపీ ఆగ్రహానికి గురవుతానని భయపడుతున్నారో.. లేక రేపో మాపో.. బీజేపీ చేరదీయక పోతుందా ? అని ఎదురు చూస్తున్న ఆయన ఈ విషయాన్ని పెద్దది చేసి.. చెలిమిని దూరం చేసుకోవడం ఎందుకని అనుకుంటున్నారో చూడాలి!!