దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి టైం నుంచి నేడు జగన్ వరకు ఆ ఫ్యామిలీని నమ్ముకుంటే న్యాయం జరుగుతుందన్న నానుడి ఉంది. నాడు వైఎస్ అయినా నేడు జగన్ అయినా నమ్మినోళ్లను వాళ్లు ఊహించని విధంగానే అందలం ఎక్కించేస్తారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల విషయంలో మరోసారి జగన్ నమ్ముకున్నోళ్లకు ఎలా న్యాయం చేస్తారో ? ఫ‌్రూవ్ అయ్యింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు ఖరారైంది.
ఇక వైసీపీ అభ్యర్థి విషయంలో నిన్నటి వరకు ఉన్న సస్పెన్స్‌కు కాస్త తెరపడింది. ఉప ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరు దాదాపు ఖరారైనట్టే అని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. ముందుగా కరోనాతో మృతి చెందిన దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వాలని తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు జగన్‌కు సూచించారు. అయినా జగన్ మాత్రం విధేయతకు పెద్ద పీట వేసినట్టే కనిపిస్తోంది. జగన్ గత ఎన్నికలకు ముందు ఏకంగా 3640 కిలోమీటర్ల మేర రాష్ట్రమంతటా సుదీర్ఘ పాదయాత్ర చేశారు.
ఈ క్రమంలోనే డాక్టర్ గురుమూర్తి జగన్‌కు వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్‌గా ఉన్నారు. పాదయాత్ర ముగిసే వరకు గురుమూర్తి జగన్‌ను వదల్లేదు. జగన్ పాదయాత్ర ముగించుకుని టెంటులోకి వచ్చిన వెంటనే ఆయన కాళ్లకు మర్దన చేయడం దగ్గర నుంచి.. వేళ్లు లాగడం ఇలా జగన్‌కు ఇబ్బంది లేకుండా చూడడంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక గురుమూర్తి కోసం ఓ పోస్టు క్రియేట్ చేసి తన వద్దే పెట్టుకున్నాడు. ఇక బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీపై హామీ ఇచ్చి వారిని కూడా కూల్ చేశారట.
ఇప్పుడు ఆ విధేయతతోనే ఏకంగా ఎంపీనే చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి జగన్ నందిగం సురేష్ లాంటి సామాన్య కార్యకర్తకు బాపట్ల ఎంపీ సీటు ఇచ్చి ఎంపీని చేసేశాడు. కర్నూలు, అనకాపల్లి ఎంపీలు కూడా రాజకీయ నేపథ్యం లేకుండానే పార్టీలోకి వచ్చి ఎంపీలు అయ్యారు. ఇప్పుడు గురుమూర్తి లాంటి బాగా చదువుకున్న యువకుడిని కూడా సంచలనాత్మక రీతిలో జగన్ ఎంపీని చేస్తారేమో ? చూడాలి.