ఫొటోషూట్లు చేసే మోడల్స్ అంటే.. తెల్లగా.. స్లిమ్‌గా ఉండాలనే భావన ఎప్పటి నుంచో జనాల్లో బలంగా పాతుకుపోయింది. అదే కోవలో డైరెక్టర్లు, ఫొటోగ్రాఫర్లు కూడా ఆ లక్షణాలు ఉండే మహిళలకే మోడల్స్‌గా అవకాశం ఇస్తుంటారు.
ఫొటోషూట్లు చేసే మోడల్స్ అంటే.. తెల్లగా.. స్లిమ్‌గా ఉండాలనే భావన ఎప్పటి నుంచో జనాల్లో బలంగా పాతుకుపోయింది. అదే కోవలో డైరెక్టర్లు, ఫొటోగ్రాఫర్లు కూడా ఆ లక్షణాలు ఉండే మహిళలకే మోడల్స్‌గా అవకాశం ఇస్తుంటారు. ఇక కలర్ కొంచెం తక్కువ ఉన్నా, ప్లస్ సైజులో మహిళలు ఉన్నా వారిని ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు. దీంతో అలాంటి వారు ఆత్మన్యూనత భావానికి లోనవుతుంటారు. ఇక తాము జీవితాంతం అవమానాలు భరిస్తూనే ఉండాలి అనుకుంటుంటారు. కానీ ఆ యువతి మాత్రం అలా కాదు. తాను సోకాల్డ్ మేథావులు నిర్వచించిన మోడల్‌లా లేకపోయినా.. ఆమె మోడల్‌గా రాణిస్తోంది. కలర్ తక్కువగా, ప్లస్ సైజులో ఉన్నప్పటికీ ఆమె మోడలింగ్ రంగంలో సత్తా చాటుతూ తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే.. ఢిల్లీకి చెందిన సభ్యసాచి మోడల్.. వర్షిత తాటవర్తి..
వర్షిత సొంత ఊరు ఏపీలోని విశాఖపట్నం. అక్కడ ఆమె పుట్టినా ఆమె ఢిల్లీలోనే పెరిగింది. అయితే ఆమె మోడలింగ్ రంగంలోకి వెళ్లేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆమె కలర్ తక్కువగా, అందులోనూ ప్లస్ సైజులో ఉండడంతో ఆమెను ఎవరూ మోడల్‌గా తీసుకునేందుకు అంగీకరించలేదు. అయినా ఆమె పట్టు విడకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే చివరకు ఆమెకు సభ్యసాచిలో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆమె అందులో మోడల్‌గా పనిచేస్తూ ఫొటోషూట్లలో పాల్గొంటూ రాణిస్తోంది.
నిజానికి ఈ సమస్య వర్షితదే కాదు.. ఎంతో మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా వర్షిత ధైర్యంగా ముందడుగు వేసింది. మోడల్ అంటే ఫలానా కలర్, ఫలానా వెయిట్, ఫలానా బాడీ షేప్‌లోనే ఉండాలనే హద్దులను చెరిపివేసింది. మోడల్‌కు ఆమె సరికొత్త నిర్వచనం చెప్పింది. బాడీ, స్కిన్ కలర్ ఎలా ఉన్నా సరే.. ఆసక్తి ఉంటే ఎవరైనా మోడల్ అవ్వచ్చని ఆమె నిరూపించింది. ఈ క్రమంలోనే ఆమె ఇప్పుడు ఎంతో మంది అలాంటి యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఏది ఏమైనా.. వర్షిత ధైర్యాన్ని మనమందరం మెచ్చుకోవాల్సిందే..!