ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇస్లామిక్ దేశాలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని నుపుర్ శర్మ తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు నుపుర్ శర్మ, ఆమె కుటుంబీకులకు భద్రత కల్పించారు.
ఈ మేరకు సోమవారం తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, చంపేస్తామని బెదిరింపు లేఖలు వస్తున్నాయని నుపుర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తాను చేసిన వ్యాఖ్యలకు కొందరు తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. భద్రత కల్పించారు.
వారం రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్‌లో స్పందించడం.. తీవ్ర దుమారానికి తెర లేపింది. దీంతో బీజేపీ నుపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అలాగే జిందాల్‌ను పార్టీ నుండి బహిష్కరించింది.