చైనాకు చెందిన షార్ట్ వీడియో మెసేజింగ్ యాప్ టిక్‌టాక్ సీఈవో కెవిన్ మేయర్ రాజీనామా చేశారు. టిక్‌టాక్ సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు లేఖ కూడా రాశారు. భారత్‌లో ఓ వైపు అన్ని చైనా యాప్‌లతోపాటు టిక్‌టాక్‌ను కూడా బ్యాన్ చేయగా.. మరోవైపు అమెరికాలో కూడా టిక్‌టాక్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల గడువిచ్చారు. అయితే తాజాగా ఏర్పడిన పరిణామాల నేపథ్యంలోనే కెవిన్ రాజీనామా చేశారు.
ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం కెవిన్ టిక్ టాక్ ఉద్యోగులకు లేఖ కూడా రాశారు. గత కొద్ది వారాలుగా రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కంపెనీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేశానని తెలిపారు. అయితే టిక్ టాక్ ఎదుర్కొంటున్న సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నానని తెలిపారు. తాను కంపెనీకి రాజీనామా చేస్తున్నానని లేఖలో రాశారు. కాగా కెవిన్ అంతకు ముందు డిస్నీ స్ట్రీమింగ్ హెడ్‌గా పనిచేయగా.. 2020 మే నెలలోనే టిక్ టాక్ సీఈవోగా చేరారు. కేవలం 3 నెలల పాటు మాత్రమే ఆయన సీఈవోగా ఉన్నారు.
ఇక కెవిన్ రాజీనామాతో టిక్ టాక్ జనరల్ మేనేజర్ వెనెస్సా పప్పాస్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. అయితే కెవిన్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. కాగా టిక్ టాక్‌పై నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఆ కంపెనీ కోర్టులో సవాల్ చేసింది. దీనిపై కోర్టులో ప్రస్తుతం వాదనలు నడుస్తున్నాయి. మరి టిక్‌టాక్ భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.