స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ప్రజల్లో పోరాట భావాలను కలిగించి… వారిని ఉద్యమంలో పాల్గొనేలా ప్రేరేపించిన వ్యక్తుల్లో బాలగంగాధర్ తిలక్ ఒకరు. తిలక్ తన మాటలతో ఎక్కువగా ఉద్యమ భావాలను ప్రజల్లో మేల్కొల్పేవారు. ప్రజలు కలిసి కట్టుగా ఉండాలని, బ్రిటిష్ వారిపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చేవారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని, దాన్ని ఎప్పటికైనా సాధిద్దామని తిలక్ అప్పట్లో ఇచ్చిన పిలుపుకు ఎంతో మంది ముందుకు వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని తిలక్ నూతన మార్గంలో నడిపించారని చెప్పవచ్చు. అలాంటి ఎంతో మంది మహానుభావుల త్యాగఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం.
తిలక్ కళాశాల విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు. అప్పట్లో దేశ ప్రజలపై బ్రిటిషర్లు, వారి పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో దేశ ప్రజల్లో భారతీయ సంస్కృతి పట్ల అవగాహన కల్పించాలని చెప్పి ఆయన డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఆయన ప్రజల్లో ఓ వైపు స్వాతంత్య్ర భావాలను పెంపొందించడంతోపాటు మరోవైపు దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యం గురించి ప్రజలకు చెప్పేవాడు. గణేష్ ఉత్సవాలను సామూహికంగా జరపడం ప్రారంభించారు. ఇలా ఆయన అప్పుడు ప్రారంభించిన ఆ కార్యక్రమం నేటికీ కొనసాగుతోంది. అందుకనే ఇప్పటికీ జనాలు గణేష్ ఉత్సవాలను సామూహికంగా జరుపుకుంటున్నారు. అదంతా తిలక్ జనాల్లో కలిగించిన స్ఫూర్తి అని చెప్పవచ్చు.
తిలక్ మరాఠీ భాషలో కేసరి దినపత్రికను నడిపేవారు. బ్రిటిషర్లు దేశ ప్రజలపై చేస్తున్న అరాచకాలను ఆయన అందులో వర్ణించే వారు. ప్రజల్లో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలనే కాంక్షను రగిలించేవారు. ఆయన వల్లే ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్నారు. దేశ ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు ఆయన అనేక కార్యక్రమాలను చేపట్టేవారు. ప్రజలంతా ఒక్కటేనని, ఒక్కటిగా మెదిలి బ్రిటిషర్లను తరమాలని పిలుపునిచ్చేవారు. ఇక స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఆయన అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చారు.
1908లో దేశద్రోహం నేరం కింద ఆయన 6 సంవత్సరాల పాటు జైలులో గడిపారు. తరువాత 1914లో బయటికి వచ్చినా ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో మళ్లీ పాల్గొన్నారు. 1920 ఆగస్టు1న ఆయన మృతి చెందారు. జనాలందరినీ ఒకే వేదికపైకి తేవడంలో ఎంతగానో కృషి చేసిందుకు గాను ఆయనకు లోకమాన్య తిలక్ అని బిరుదు వచ్చింది. అలా తిలక్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహానీయుల్లో ఒకరిగా నిలిచారు.