నేటి తరుణంలో అధిక శాతం మంది స్థూలకాయ సమస్యతో సతమతమవుతున్నారు. దీనికి తోడు భారీగా పెరిగిపోయిన బాన పొట్టతోనూ అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాటిని తగ్గించేందుకు నానా తంటాలు పడుతున్నారు. నిత్యం వ్యాయామాలు చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం తదితర పనులు చేస్తున్నారు. అయితే వీటితోపాటు పలు ముఖ్యమైన సూచనలను కూడా పాటించాలి. అలాంటప్పుడే పొట్ట దగ్గర కొవ్వును త్వరగా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. వారానికి కనీసం 250 నిమిషాల వరకు వ్యాయమం చేసేలా చూసుకోవాలి. 250 నిమిషాలను వారం రోజులకు విభజించుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం వ్యాయామం చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది.
2. నిత్యం చేసే వ్యాయామంలో కొంత సమయం అయినా చాలా కఠినంగా ఉండే వ్యాయామాలను చేస్తే అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చు.
3. మద్యం సేవించడం మానేయాలి. మద్యం సేవించడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుందని తెలుసుకోవాలి. మద్యం సేవించడం మానేస్తే పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో రోజూ చేసే వ్యాయామం వల్ల పొట్ట తగ్గుతుంది.
4. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్‌ను తీసుకోకూడదు. ఇవి బరువును అధికంగా పెంచుతాయి.
5. కొందరు నిత్యం వివిధ సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. అలా అవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఫలితంగా అధికంగా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వారు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
6. నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించకపోవడం వల్ల కూడా అధికంగా బరువు పెరుగుతారు. కనుక నిత్యం కనీసం 8 గంటల పాటు అయినా నిద్రపోవాలి. దీంతో శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.