టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బైక్‌ను తప్పించే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో అచ్చెన్నాయుడి చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కారులో ఉన్న గన్‌మన్ సహా మరికొందరికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
నిన్న గుంటూరులోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు ప్రమాద వార్త తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యారు. అయితే, ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.