నేడే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..

-

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, మంగళవారం జరిగే ఈ కార్యక్రమం కోసం సర్వాంగ సుందరంగా మండపాన్ని తీర్చిదిద్దామని వెల్లడించారు ఆలయ అధికారులు. బోనం కాంప్లెక్స్‌ను పరిశుభ్రం చేస్తున్నారు. బల్కంపేట ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన కల్యాణ మండపం ఎదుట, వెనుక రోడ్లను బ్లాక్‌ చేసి క్యూలు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. సోమవారం నుంచే భక్తుల రాక మొదలైంది. భారీ వర్షం కురిసినా భక్తులు తడవకుండా ఉండేందుకు షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. అర్చకులు, వేద పండితులు గణపతి పూజతో ఉత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎదుర్కోళ్లను ప్రారంభించి ఒగ్గు కళాకారులతో గంగతెప్ప, పుట్ట బంగారాన్ని అర్చకులు, ధర్మకర్తలు శాస్ర్తోక్తంగా ఆలయానికి తీసుకొచ్చారు.

ఎల్లమ్మ కల్యాణం ఉత్తరా నక్షత్రయుక్త కన్యాలగ్న సుముహూర్తమున వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మంగళవారం ఉదయం 11.45 గంటలకు జరగనుంది. అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దంపతులు తీసుకురానున్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.36 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును మంత్రి తలసాని సోమవారం ప్రారంభించారు. అనంతరం కల్యాణం ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version