తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీ గా పెరిగాయి. రాష్ట్రంలో చాలా చోట్ల 42, 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే.. ప్రజలు బయటకు రావాలంటే.. జంకుతున్నారు. అయితే తాజా గా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు హెచ్చరికలు జారీ చేసింది. భారీ ఉష్ణోగ్రతలతో పాటు.. వడగాడ్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు, రేపు.. రెండు రోజుల పాటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఉష్ణోగ్రతుల ఎక్కువగా ఉండటంతో పాటు వేడి గాలులు రావడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే వడ గాడ్పుల వల్ల వడ దెబ్బలకు గురి కావద్దని సూచించింది. వడ దెబ్బకు గురి అయితే.. తీసుకోవాల్సిన చర్యలను కూడా వాతావరణ కేంద్రం వివరించింది.
వడ దెబ్బకు గురి అయిన వ్యక్తిని చల్లటి నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలని తెలిపింది. వారి శరీర ఉష్ణోగ్రతను 101 డిగ్రీల వరకు వచ్చేలా చూడాలని వివరించింది. ఆ వ్యక్తిని చల్లటి గాలికి పడుకోబెట్టాలని తెలిపింది. అయితే ఇలా చేసినా.. ఫలితం లేకుంటే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాలని సూచించింది.