తన ఇష్టపూర్వకంగానే బంధువుతో కలసి వెళ్లి లైంగికంగా కలిసినా బాధితురాలు మైనర్ కావడంతో అత్యాచారం కిందికే వస్తుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం వల్ల వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలిగించుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (15) ఎనిమిదో తరగతి వరకు చదివింది. ఖమ్మం జిల్లాకు చెందిన బంధువు(26)కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను వ్యక్తిగత పనుల నిమిత్తం నవంబర్‌లో బాలిక ఇంటికి వచ్చాడు. కొద్దిరోజుల పాటు ఇక్కడే ఉన్న అతను బాలికను బెదిరించి బయటకు తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం ఆమె తల్లి నిలోఫర్ వైద్యులను సంప్రదించింది. ఇందుకు డాక్టర్లు నిరాకరించారు. చట్ట ప్రకారం అనుమతులు అవసరమన చెప్పడంతో బాలిక తరఫున ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది. 15ఏళ్ల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బదులకు గురవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. గర్భం కారణంగా మైనర్ బాలిక అయిన బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని, శారీరకంగా, మానసికంగా ప్రభావం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవచ్చని తెలిపింది.
అయితే, అబార్షన్ కంటే ముందు బాలికతో మాట్లాడాల్సి ఉందన్న హైకోర్టు.. 20 వారాల గర్భంతో బాధితురాలు కోర్టుకు రావడం ఇబ్బందికరమని.. నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు తమ అభిప్రాయం చెప్పాలని సూచించింది.