వాహనదారులకు మరో షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను కేంద్రం 5% పెంచింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఏ), స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) గణాంకాల ఆధారంగా ఏటా ఏప్రిల్ 1న టోల్ ఛార్జీలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పెంచుతోంది.
సొంత కారులో 24 గంటల వ్యవధిలో హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి 65 మీదుగా వెళ్లి రావడానికి వాహనదారులు ప్రస్తుతం రూ.465 టోల్ చెల్లిస్తున్నారు. శనివారం నుంచి రూ.490 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.25 పెరిగింది. ఈ మార్గంలో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఒకవైపు ప్రయాణానికి ప్రస్తుతం రూ.310 చెల్లిస్తుండగా ఇకపై రూ.325 చెల్లించాల్సి ఉంటుంది. మినీబస్సులు, లైట్ మోటార్ వాణిజ్య, సరకు రవాణా వాహనాలు, భారీ, అతి భారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా 5 శాతం వసూలు చేయనున్నారు.