ప్రస్తుత కాలంలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వారి సరదాల కోసం అంటూ వారిని ఇష్టానుసారంగా పెంచడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అనంతరం కొన్ని సందర్భాలలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు పిల్లలు దానిని భరించలేక కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భూపాలపల్లి జిల్లా కాటారంలో చోటుచేసుకుంది.
సెల్ ఫోన్, కేబుల్ టీవీ రీచార్జ్ చేయించమని అడిగినందుకు తల్లి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 9వ తరగతి చదువుతున్న తరుణ్.. రీఛార్జ్ కోసం తల్లి యశోదను డబ్బులు అడిగాడు. చదువుకునే వాడికి అవన్నీ ఎందుకు అని ఆమె మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన తరుణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.