సినిమా ఫ్యాన్స్ కు షాక్.. పది వారాల తర్వాతే ఓటీటీలో సినిమా..!

తెలుగు సినీ నిర్మాతల మండలి సినీ ప్రియులకు షాక్ ఇచ్చింది. ఓటీటీలో సినిమా విడుదలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్‌లో విడుదలైన భారీ చిత్రాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది.

 

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా, తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. అయితే, అనూహ్యంగా నిర్మాతల కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన పలు కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

కార్యవర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్న కీలక అంశాలు ఇవే.. 

  1. భారీ బడ్జెట్‌ చిత్రాలను 10 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలి.
  2. పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిన చిత్రాలు 4 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వవచ్చు.
  3. రూ.6కోట్లలోపు బడ్జెట్‌ చిత్రాలపై ఫెడరేషన్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటారు.
  4. సినిమా ప్రదర్శనకు వీపీఎఫ్‌ (వర్చువల్‌ ప్రింట్ ఫీజు) ఛార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించాలి.
  5. సినిమా టికెట్‌ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతిపాదించింది.
  6. సాధారణ థియేటర్లు, సి-క్లాస్‌ సెంటర్లలో టికెట్‌ ధరలు రూ.100, రూ.70గా ఉంచాలని ప్రతిపాదించారు.
  7. ఇక మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125, రూ.150 ఉండేలా ప్రతిపాదనలు చేశారు.

కరోనా సమయం నుంచి ఓటీటీకి బాగా అలవాటుపడిన సినిమా ప్రియులు చాలా వరకు థియేటర్ వరకు వెళ్లడం తగ్గించారు. థియేటర్ లో విడుదలైన సినిమా మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రావడం కూడా సినిమా హాల్ కు వెళ్లి చూసే వారి సంఖ్య తగ్గడానికి కారణం. ఏది ఏమైనా నిర్మాతల మండలి ఈ నిర్ణయం సినీ ప్రియులకు ముఖ్యంగా ఓటీటీ ఫ్యాన్స్ కి పెద్ద ఎదురదెబ్బ.