మైనర్ ఛాతి భాగాన్ని ముట్టుకోవడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. వివరాల్లోకివెళితే.. పవన్, ఆకాష్ అనే ఇద్దరు యువకులు 11 ఏళ్ల బాలిక ఛాతి భాగాన్ని పట్టుకున్నారని, వారిలో ఒకరు ఆమె పైజామా దారాన్ని తెంపివేయగా..మరొకరు కల్వర్టు కిందికి లాగడానికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో అలహాబాద్ ట్రయల్ కోర్టు పోక్సో చట్టంలోని సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ 18 (నేరం చేయడానికి ప్రయత్నించడం) కింద విచారణకు హాజరు కావాలని నిందితులకు సమన్లు పంపింది.
ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు.దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సమన్లలోని సెక్షన్లను సవరిస్తూ సంచలన తీర్పునిచ్చారు. మైనర్ ఛాతి భాగాన్ని పట్టుకోవడం,ఆమె పైజామా దారాన్ని తెంపివేయడం, పారిపోయే ముందు కల్వర్లు కిందికి లాగడం వంటి చర్యలు అత్యాచారం కానీ, అత్యాచార ప్రయత్నం కింద కానీ పరిగణించబడవని తీర్పు చెప్పారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు),సెక్షన్ 354-B (మహిళల గౌరవాన్న దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద వారికి సమన్లు జారీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.