తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఎట్టకేలకు కొత్త అధ్యక్షుడు వచ్చారు. మొన్నటివరకు టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు.ఆయన కీలక పదవిలో ఉన్నందున రెండు పదవీ బాధ్యతలు నిర్వహించడం పార్టీలో నిబంధలకు వ్యతిరేకం.అందుకే టీపీసీసీ చీఫ్ పదవికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్‌కు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ పేరును ఖరారు చేయడంతో తొలిసారి మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డితో ఆయన శనివారం భేటీ కానున్నారు. తన పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపనున్నట్లు సమాచారం. అయితే, పీసీసీ చీఫ్ పదవి కోసం అన్ని వర్గాల వారు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, సీఎం రేవంత్ సూచన మేరకు బీసీ నేతకు ఈ పదవి వరించడంతో ఆ వర్గం నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ విద్యార్థి నేతగా గత 30 ఏళ్లకు పైగా పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనకు కిందిస్థాయి నేతలతో కూడా మంచి పరిచయాలు ఉన్నందునే అధిష్టానం చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.