సాధారణంగా ఉద్యోగానికి లేట్ అవుతుందనో.. లేక పిల్లల స్కూల్ టైం దాటిపోతుందనో.. ఇంకేదైనా అత్యవసర సమయాల్లో అయినా ఒకటి రెండు సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతుంటారు. దీనికి అనుగుణంగానే ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తుంటారు. ఇలా ఒకటి, రెండు సార్లు గరిష్టంగా ఓ పది సార్లు చలానాలు పడుతుంటాయి వాహనాలపై.
కానీ ఈ బండిపై మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 103 చలానాలు ఉన్నాయి. దాదాపు ఇన్ని సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడు సదరు ద్విచక్ర వాహన యజమాని. బుధవారం సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బుధవారం పోలీసులు ఉదయం 11 గంటల ప్రాంతంలో అప్జల్ గంజ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అటుగా వచ్చిన పురానాపూల్ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి బైక్ ను అపారు. అయితే బైక్ నెంబర్ పై చలానాలు పరిశీలించగా.. పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. దానిపై నగరంలో 103 చలానాలు ఉన్నాయి. రూ. 32,200 పెండింగ్ చలానాలు ఉన్నాయి. దీంతో బండిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.