నివాళి : కోకిల లేదు పాట ఉంటుంది

-

మేలి మ‌లుపు జీవితం గురించి ల‌తాజీ పాట గురించి ఈ ఆదివారం గురించి కొత్త‌గా ఏమయినా చెప్పిపోవాలి. పాట ఆగిన చోట నివాళి,పాట ప్రారంభం ఓ మేలు కొలుపు.మేలు కొలుపు అన్న‌ది ఓ విరుద్ధం అయిన భావం.నివాళి అన్న‌వి విస్తృతం అయిన అర్థం. గాన కోకిల పాట విని పుల‌కించిన శ్రోత‌ల‌కు దుఃఖ పూరిత సంద‌ర్భాలే ఈ ఆదివారం తారసిల్లుతున్నాయి. జీవితం ఎక్క‌డో ఓ ద‌గ్గ‌ర నిలువ‌రింత‌కు లోన‌వుతుంది. పాట ఆ చోట ఊర‌డింపుగా ఉంటుంది.ల‌తాజీ పాట వేల గొంతుల‌కు తీయ‌ని గ‌మ‌కం.గ‌మ‌నం కూడా!

చేదు జీవితం ఒక‌టి ఉంటుంది. ఆస్ప‌త్రి ఓ చేదు.. జీవితేచ్ఛ ఓ తీపి..తీపి మ‌ర‌ణం..వాంఛ చేదు.. చేదు అని చూడ‌డంలో అర్థం విషాదం. చేదు అని ప‌ల‌కడం ఓ అనుభ‌వ పూర్వ‌క విషాదం. ల‌తాజీ అనుభ‌వ పూర్వ‌క  వ‌ర్త‌మానం అనుభ‌వ పూర్వ‌క విషాదం కూడా! అర్థ ప‌రమార్థ సంకేతిక‌లు జీవితాల‌ను నిర్దేశించి వెళ్తాయి. ల‌తాజీ ప్ర‌వ‌చించిన అర్థం లేదా నిర్వ‌చించిన అర్థం పాట… జీవితానికి చెప్పిన అర్థం పాట..ల‌తాజీ కొన్ని వేల గొంతుక‌ల్లో అర్థ‌వంతం అయిన జీవితం దాచి వెళ్లారు.. హృద‌యాల్లో దాచి ఉంచారు. నిక్షిప్త స్వ‌ర చ‌ర్చ‌ల్లో ఉన్నారు.. ఉద్వేగ ఆనందాలలో కూడా ఉంటారు. ఆమె పాడడం జాతికి గ‌ర్వ‌కార‌ణం.. ఆమె ఆగిపోవ‌డం జాతి చేసుకున్న దౌర్భాగ్యం. దుర‌దృష్టం.

దురదృష్ట కాలాలు కొన్ని వీడి పోతే బాగుంటాయి. క‌రోనాకార‌ణంగా ఆమె ఆస్ప‌త్రిలో చేరి ఆ మ‌హ‌మ్మారి జాడ‌ల‌కు బ‌లైపోయిన సంద‌ర్భాల‌ను మ‌నం ఏ విధంగా తీసుకోవాలి. ల‌లాజీ కొన్ని కుటుంబాల‌కు ప్రాణ‌ప్ర‌దం  అయిన గొంతుక.. ఆ గొంతుక‌కు మ‌ర‌ణం అన్న‌ది ఆపాద‌న చేయ‌డం ఓ దౌర్భాగ్య రీతి. చదువుకున్న‌వాళ్లెవ్వ‌రూ ఆ ప‌ని చేయ‌కండి.. ఆమెకు నివాళి.. నిగ్ర‌హ పూరిత వాతావ‌ర‌ణంలో ఉంటే చాలు..సంతోష పూర్వ‌కం అయిన ప్రార్థ‌న ఆమె చేసి వెళ్లారు.ఆ ప్రార్థ‌న‌ల‌ను మ‌రో సారి ఆలపిస్తే చాలు. ప్రార్థన చేసి ల‌తాజీకి వీడుకోలు చెప్పాలి. తెలుగు వారికీ ఆమె తెలుసు. ఆ మాట‌కు వ‌స్తే భార‌తీయ భాష‌ల‌న్నింటికీ ఆమె తెలుసు.. ఆమె తెలియ‌ని చోటు ఏదీ లేదు క‌నుక ఆమె అన్నింటా ఉంటే అందరిలో ఉంటే ఆనందానికి ప‌ర‌వ‌శ ఛాయ ఒక‌టి ఏంట‌న్న‌ది త‌ప్ప‌క తెలుస్తుంది. దుఃఖానికి అంతిమం ఏంట‌న్న‌ది అందుతుంది.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి, శ్రీ‌కాకుళం దారుల నుంచి 

Read more RELATED
Recommended to you

Exit mobile version