మేయర్ పీఠం కోసం మంత్రుల లాబీయింగ్..రంగంలోకి కోడళ్లు,కూతుళ్లు

-

మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. మేయర్ సాధారణ మహిళా రిజర్వేషన్‌ కావడంతో మహిళామణులు తెరపైకి వచ్చారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, కీలక నేతలు తమ కోడళ్లను, ఒకరు తమ భార్యను రంగంలోకి దింపారు. మేయర్ అభ్యర్థి కోసం తీవ్ర స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, ప్రస్తుత మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్లు వినిపిస్తున్నాయి.


మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తన కోడలు మహితను రంగంలోకి దింపారు. మేయర్ రేసులో నిలబెట్టేందుకు కార్పొరేటర్ టికెట్‌ను ఆశిస్తున్నారు. తలసాని కంటే ఒకడుగు ముందుకేసిన మేయర్ బొంతు రామ్మోహన్‌ తన భార్య శ్రీదేవితో వెళ్లి మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ భేటీలో మేయర్ టికెట్‌ను ఆశిస్తున్న విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మరో వైపు డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోడలు శిల్పా రామేశ్వరిని మేయర్ రేసులో నిలబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రి మల్లారెడ్డి కూడా తన కోడలు ప్రీతిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు లాబీయింగ్ పెద్ద ఎత్తునే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్‌ కుమార్తె విజయలక్ష్మీ కూడా ఈసారి మేయర్ పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు కే,కేశవరావు సైతం తన కుమార్తెను ఈసారి గ్రేటర్‌ బరిలో దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా మేయర్ అభ్యర్థి విషయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పార్టీలోని ముఖ్యనేతలు కూతుళ్లు, కోడళ్లకు టికెట్లు ఇప్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

గ్రేటర్‌ ఎన్నికలను భుజానకెత్తుకున్న మంత్రి కేటీఆర్‌కు సహకరించేందుకు ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగారు. మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యనేతలంతా ప్రస్తుతం కవితను కలిసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మేయర్ మహిళ కావడంతో ఇప్పటి వరకు రాజకీయ అరంగేట్రం చేయని యువ మహిళామణులు గ్రేటర్‌ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version