పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవలే కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో సందేశం ఇచ్చారు. తాను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నానని, తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హాస్పిటల్ యాజమాన్యానికి సూచనలు చేశారని, అందువల్ల తనకు వైద్యులు చక్కని చికిత్స అందిస్తున్నారని తెలిపారు. తాను ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నానని, ఎవరూ భయాందోళనలకు గురవ్వాల్సిన పనిలేదని, త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అవుతానని తెలిపారు.
కాగా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతోపాటు అధికారులకు కూడా కరోనా సోకింది. దీంతో దాదాపుగా అందరూ కరోనా నుంచి కోలుకుని తిరిగి యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.