దేశ ప్రధాని నరేంద్ర మోడీ… రెండు రోజుల కిందట రెండు తెలుగు రాష్ట్రాల విభజనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలతో.. టీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించి.. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలిపాయి. ఇక తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ రాజ్య సభ సభ్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాజ్య సభ ను బహిష్కరించారు టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఒక్క రోజు మాత్రం రాజ్య సభను బాయ్ కాట్ చేస్తున్నట్లు చెప్పారు టీఆర్‌ఎస్ ఎంపీలు. ఇక అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీపై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ నోటీసులు అందించారు టీఆర్ఎస్ ఎంపీలు.
ఈమేరకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులను రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు నోటీసులు అందించారు. ఎంపీలు కేశవరావు, సంతోష్, బడుగుల లింగయ్యయాదవ్ నోటీసులు అందించిన వారిలో ఉన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారని ప్రివిలేజ్ మోషన్ నోటీసుల్లో ఫిర్యాదు చేశారు. తలుపులు మూసేసి బిల్లును పాస్ చేశారనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు.