దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలి- రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

-

తెలంగాణ రాజకీయం వడ్ల కొనుగోలు చుట్టూ తిరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఏర్పడుతున్నాయి. తాజాగా బీజేపీని విమర్శిస్తూ టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. రైతులు, తెలంగాణ ప్రజల పక్షాన ధర్నా చేయాలనుకుంటే బీజేపీ నేతలు కేంద్ర కార్యాలయాల ముందు ధర్నా చేయాలి కానీ రాష్ట్ర కార్యాలయాల ముందు కాదన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లో ధర్నా చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు కనీసం సోయి కూడా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కనీస అవగాహన లేని వ్యక్తులు బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం దురద్రుష్టకరం అన్నారు. బీజేపీ ధర్నాలకు వచ్చే రైతులు కాదని.. కేవలం ఆపార్టీ కార్యకర్తలే అన్నారు. బీజేపీ పువ్వులు మీ చెవుల్లో పెట్టుకోండి కానీ.. ఇతరుల చెవుల్లో పెట్టవద్దని ఎద్దేవా చేశారు. పంజాబ్లో కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విధంగానే తెలంగాణ లో కూడా కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పల్లా డిమాండ్ చేశారు. బీజేపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.

రాష్ట్రంలో రైతుల వద్దకు కొనుగోలు కేంద్రాలు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో వానాకాలం వడ్లు కొనడానికి 6663 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో ఇప్పటికే 3550 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పటి వరకు రూ.1000 కోట్ల విలువైన 5,11,334 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశామని వెల్లడించారు పల్లా.

Read more RELATED
Recommended to you

Exit mobile version