మంగళవారం రాత్రి ఇరాన్ తమ స్థావరాలపై చేసిన దాడులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసారు. ఇరాన్ చెప్తున్నట్టు గా తమ సైనికులు ఎవరూ మరణించ లేదని ఆయన అన్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9;30 నిమిషాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా క్షిపణి దాడులకు సంబంధించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసారు.
అమెరికా సైనికులు చనిపోలేదని చెప్పిన ఆయన, ముందస్తు చర్యల కారణంగా రెండు వైపులా ప్రాణాలు కాపాడగలిగామని, సైనికులంతా సురక్షితంగా ఉన్నారన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల్లో ఇరాన్ ముందుందన్న ఆయన సులైమానీ హత్య గురించి మాట్లాడుతూ, గత వారం అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను మట్టుబెట్టామని వ్యాఖ్యానించారు. సులేమానీని ఎప్పుడో చంపాల్సిందని,
ఇప్పటికే ఆలస్యం చేశామ౦టూ ఇరాన్ ని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేసారు. తన ఆదేశాల మేరకే సులేమానీని చంపేశారని ట్రంప్ మరోసారి స్పష్టం చేసారు. ఉగ్రవాదానికి ఊతమిస్తూ ఇరాన్ అందరి ముందు దోషిగా నిలబడిందన్న ఆయన ఉగ్రవాదాన్ని కొనసాగనివ్వమని స్పష్టం చేసారు. ఇరాన్‌పై త్వరలో మరిన్ని కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధిస్తామన్న ట్రంప్, ఆ దేశానికి అణ్వాయుదాలు తయారు చేసే అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేసారు. ఇరాన్ దిగిరాకపోతే మాత్రం కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు.