తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. ముఖ్యంగా ఉద్యోగుల వేతన సవరణ, కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ ఎత్తివేత అంశాలపై కేబినెట్ చర్చించనుంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటం అలాగే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతుండటంతో.. తెలంగాణలో పగటి వేళల్లో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపులు ఉన్నందున దీనిని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించి.. ఏప్రిల్ లో విధించినట్టు కేవలం రాత్రిపూట మాత్రమే కొనసాగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కీలకమైన ఆర్టీసీ బస్సులు మెట్రో సేవలను కూడా సాయంత్రం వరకు అనుమతించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అటు ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పూర్తి వివరాలతో నోట్‌ను ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ రూపొందించినట్టు తెలిసింది. ఈ నోట్‌ను మంత్రివర్గం ముందుంచనున్నారు. అయితే వీటిపై ఇవాళ సాయంత్రంలోపు కీలక ప్రకటన రానుంది.