తెలంగాణ ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ-2024 నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి 1:3 నిష్పత్తిలో జాబ్ వెరిఫికేషన్ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అయితే, ఇటీవల ఈ డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలకు క్వాలిఫై అయిన 7 గురిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడుగురు హిందీ పండిట్లు ఉద్యోగాలు కోల్పోయారు.1:3 నిష్పత్తిలో ముందుగా వీరికి ఉద్యోగాలు రాగా వీరికి అర్హత లేదని కొందరు ఫిర్యాదు చేశారు. వెరిఫికేషన్లో క్లీన్ చిట్ రావడంతో 20 రోజుల పాటు టీచింగ్ కూడా చేశారు. కొందరు డీఎస్సీ అభ్యర్థులు వీరిపై కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేయగా.. డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ తీసుకోలేదని విచారణలో తేలింది. దీంతో వారిని తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.