ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవసరమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఅన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి శివారులో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలంగాణ సాధనకు అహర్నిశలు కష్టపడ్డ కేసీఆర్ సీఎం కావడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు. ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనవి కూడా అమలు చేశారని పేర్కొన్నారు. ముక్కు,మొహం తెలియని వారు వచ్చి చెప్పే మాటాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
తెలంగాణ ఆవిర్భావ, దశాబ్ది వేడుకలలో భాగంగా హనుమకొండ జిల్లా మడికొండ పారిశ్రామిక కేంద్రం ఆవరణలో మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని, చిన్నషాపులు జనరేటర్ పెట్టుకుని వ్యాపారం చేసుకునేవారిని అన్నారు. రాష్ట్రం ఏర్పాటుతో సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ కృషితో పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. భారీగా పెట్టుబడులతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తెలంగాణ యువతకు లభిస్తున్నాయని వివరించారు.