రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసు అధికారిగా తన తండ్రికి లభించిన గౌరవం కళ్లారా చూసిన ప్రవీణ్.. తానూ ఖాకీ యూనిఫాం వృత్తిలో చేరాలని కలగన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అందుకు అడ్డదారి తొక్కి కటకటాల పాలైనట్లు అధికారులు తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘అదనపు ఎస్పీగా పనిచేస్తున్న తండ్రి విధి నిర్వహణలో ఉండగా మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌కు ప్రభుత్వ ముద్రణా సంస్థలో ఉద్యోగం వచ్చింది. అనంతరం టీఎస్‌పీఎస్సీలో వచ్చిన ప్రవీణ్.. ఏఎస్‌వో వరకు ఎదిగాడు. కమిషన్‌లో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేసిన పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డితో స్నేహం చేశాడు.’
‘గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడనుందనే సమాచారంతో ప్రవీణ్ అప్రమత్తమయ్యాడు. పరీక్ష రాసి డీఎస్పీ/జైలర్ పోస్టు సంపాదించాలని అనుకున్నాడు. అతడు, రాజశేఖర్‌రెడ్డి కలిసి.. గతేడాది అక్టోబరు మొదటి వారంలో ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లలోకి కాపీ చేశారు. పరీక్ష రాసిన ప్రవీణ్.. లీకేజీ విషయం బయటపడితే తన ఉద్యోగం పోతుందని భయపడి కావాలనే డబుల్ బబ్లింగ్ చేశాడు. తన చేతికి వచ్చిన మిగిలిన ప్రశ్నపత్రాలతో పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలని పథకం వేశాడు.’ అని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం