జాతీయ రహదారుల టోల్ ప్లాజాల ఛార్జీలను పెంచుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై మొత్తం 28 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో ఏడు, హైదరాబాద్‌లో 11, వరంగల్‌లో ఐదు, ఖమ్మంలో ఐదు టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ప్లాజాల ఛార్జీలను కేంద్రం పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే.
జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను కేంద్రం అయిదు శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయడానికి తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. కొత్త ఛార్జీలు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయి. ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్‌ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 పెంచినట్లు తెలిసింది.
ఇటీవల ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ.15, ఏసీ స్లీపర్‌లో రూ.20 టోల్‌ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొన్ని సిటీ ఆర్డినరీ బస్సులు టోల్‌ప్లాజా మీదుగా హైదరాబాద్ నుంచి సమీప ప్రాంతాలకు వెళ్లివస్తున్నాయి. వీటికి కూడా మరో రూ.4 పెంచారు.