స్వామి వారి భక్తులకు గుడ్ న్యూస్..టికెట్ బుకింగ్ కోసం జియో కొత్త యాప్..!

తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి జియో ప్రతినిధి శ్రీ అనిష్ ఎంఓయూ పై సంతకాలు చేశారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ… కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయడంతో ఒకేసారి లక్షల మంది భక్తులు టికెట్ కోసం ప్రయత్నించారన్నారని చెప్పారు. దీంతో టిటిడి సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఈ సమస్యలను అధిగమించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం టోకెన్లు జారీ చేయడం కోసం జియో సంస్థ ముందుకు వచ్చిందని సుబ్బారెడ్డి చెప్పారు.

గత నెలలో జియో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేశామన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు గంటల లోపు టికెట్ల బుక్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇక టిటిడికి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్ తయారుచేయడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ యాప్ లో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఈ యాప్ ను ఆవిష్కరించే ఏర్పాటు చేయాలని చైర్మన్ కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు.