కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆయనను తలచుకుంటే చాలు బాధలు తొలుగుతాయని భక్తులందరి నమ్మకం. ఆయన దర్శనం కోసం ఎన్నో ఇబ్బందులు పడి తిరుమల చేరుకునే భక్తులు.. అక్కడికి చేరాకా ఒక్కసారిగా తమ బాధలన్నీ మరిచిపోతారు. గోవింద నామస్మరణతో భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. శ్రీవారి దర్శనం చేసుకునే కొన్ని క్షణాలు ఏదో తెలియని అనుభూతి పొందుతారు.
అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా.. భక్తులకు శ్రీవారి దర్శనం రద్దు చేశారు. ఆలయంలో మాత్రం శ్రీవారికి జరగాల్సిన సేవలకు ఏ మాత్రం లోటులేదు. అర్చకులు స్వామివారికి ఏకాంత సేవలు చేస్తున్నారు. అయితే తిరుమల ప్రతి అణువులో శ్రీవారి రూపమే దర్శనమిస్తుంది. తాజాగా తిరుమల కొండల్లో సహజసిద్ధంగా స్వామి రూపం కనిపించే చోట తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోప్ సాయంతో కొండ మీద శ్రీవారి ఆకారానికి పాలాభిషేకం నిర్వహించారు. అలాగే పెద్ద గజమాలతో అలంకరించారు. ఆ దృశ్యాలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, గతంలో కూడా పలువురు ఇదే చోట శ్రీవారి రూపానికి పాలాభిషేకం నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే లాక్ డౌన్ తర్వాత స్వామి వారిని భక్తులు దర్శించే ప్రక్రియలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి. భౌతిక దూరం పాటించేలా క్యూ లైన్లలో మార్పులు చేయాల్సి ఉందన్నారు. ఇదివరకే కరోనా కష్టాలను తొలగించాలని టీటీడీ అధికారులు, అర్చకులు ధన్వంతరి యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే.
#Beautifulvisual: #TTD has performed pooja and Palabhishekam to Lord #Venkateshwara‘s shape, which was naturally formed at the top of the #Tirumala hill at #AndhraPradesh. However, the temple doors were closed to #pilgrims in view of #COVID19. pic.twitter.com/4oMknJve7k
— Balakrishna – The Journalist (@Balakrishna096) May 7, 2020