సెల్ఫీ ఇవ్వలేదన్న కోపంతో టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షాను వెంబడించడమే కాకుండా దాడి చేసిన ఘటన కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ తరఫు న్యాయవాది పృథ్వీపై సంచలన ఆరోపణలు చేశారు. పృథ్వీ షా మద్యం తాగి ఆమెపై బ్యాట్‌తో దాడి చేశాడని ఆరోపించారు.
“ఫైవ్ స్టార్ హోటల్లో సప్నా గిల్.. సెల్ఫీ తీసుకునేందుకు పృథ్వీ షా దగ్గరకు వెళ్లింది. అప్పుడు వారంతా పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో షా కూడా మద్యం సేవించి ఉన్నాడు. అప్పుడు తన దగ్గర ఉన్న బ్యాట్‌తో సప్నాపై దాడి చేశాడు. తర్వాత రోజు.. ఆమెపైనే కేసు పెట్టాడు. ఇప్పుడు అతడిపై మేము కేసు పెడతాం. మద్యం సేవించి అతడు కారు నడిపాడు. బైక్‌ను కూడా ఢీకొన్నట్లు తెలిసింది. సప్నా, పృథ్వీ షా మధ్య ఎలాంటి పరిచయం లేదు” అని సప్నా గిల్ లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ తెలిపారు.