ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు విజయం సాధించారు. త్వరలోనే వీరు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకే చంద్రబోస్, మోపిదేవిలు తమ మంత్రి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు.. మంత్రి పదవులకు రాజీనామా లేఖల్ని సీఎం జగన్ కు సమర్పించారు.
మంత్రి పదవుల రాజీనామా విషయంలో సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు ఇద్దరూ. మండలి ఛైర్మన్ ఇద్దరి రాజీనామాలకు ఆమోదం తెలిపారు. రాజీనామా అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని, అయితే కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేట్లు కనబడలేదని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తనకు నమ్మకం లేదని.. అది కూడా తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు.
అలాగే మంత్రిగా తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని జగన్‌ను కొనియాడారు. పార్టీ కార్యకలాపాలను ప్రతి సభ్యుడు గౌరవించవలసిందేనని ఎంపీ రఘురామ కృష్ణరాజు గురించి వ్యాఖ్యానించారు. అదేవిధంగా పార్లమెంట్‌కు వెళ్లాలన్నది తన చిరకాల కోరికని, సీఎం జగన్ చొరవతో అది నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు ఆయన.