యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ మహిళ రికార్డు బ్రేకింగ్ టైమ్‌లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. డాక్టర్ ఖావ్లా అల్‌రొమైతి అనే మహిళ అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. 3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లలో ఆమె ఆ రికార్డును సాధించింది.
ఖావ్లా మొత్తం 7 ఖండాలను సందర్శించింది. ఆ ఖండాల్లోని 208 దేశాలను చుట్టి వచ్చింది. ఫిబ్రవరి 13న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆమె ప్రయాణం ముగిసింది. అయితే కోవిడ్ కారణంగా ఆమె రికార్డును పొందడం ఆలస్యం అయింది.
యూఏఈ 200 భిన్న దేశాల వాసులకు నిలయం. అందుకనే వారందరి దేశాలకూ వెళ్లి వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను తెలుసుకోవాలనుకున్నాను. కనుకనే ఈ పర్యటన చేశానని ఆమె తెలిపింది. కానీ అందులో భాగంగా ఆమె గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం.
సాధారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు అంటే కష్టంతో కూడుకున్న పని. వీసాలను తీసుకోవడం, టిక్కెట్లను బుక్ చేసుకోవడం, విమానాల్లో గంటల తరబడి ప్రయాణించడం.. లాంటి కష్టాలన్నీ ఉంటాయి. కానీ ఆమె అంత తక్కువ వ్యవధిలోనే ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ చాలా తక్కువ వ్యవధిలో అన్ని దేశాలను చుట్టి రావడం నిజంగా విశేషమనే చెప్పవచ్చు.