ప్రైవేట్ ప్రజా రవాణా సంస్థలైన ఉబర్, ర్యాపిడో ట్యాక్సీ-బైక్ సేవలకు దిల్లీ సర్కార్ షాక్ ఇచ్చింది. దిల్లీలో ఈ సేవలపై ఆ ప్రభుత్వం తుది విధానం రూపొందించేవరకు నిషేధం విధించింది. మళ్లీ దిల్లీ సర్కాక్ చెప్పేవరకు.. బైక్-ట్యాక్సీలను నడుపుకోవడానికి ఈ రెండు సంస్థలను అనుమతిస్తూ గత నెల 26న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది.
జులై ఆఖరికల్లా కొత్త విధానాన్ని తీసుకొస్తామని ఆప్ ప్రభుత్వ వాదనను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందల్ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ర్యాపిడో, ఉబెర్‌లు మోటార్ వాహనాల చట్టం-1988ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ..దిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో బైక్-ట్యాక్సీ సేవలను నిషేధించింది. బైక్ టాక్సీలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని దిల్లీ రవాణా శాఖ నోటీసుల్లో స్పష్టం చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా బైక్ టాక్సీ సేవలను కొనసాగిస్తే మొదటిసారైతే రూ.5,000 జరిమానా, రెండోసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు నిబంధనలు మీరితే రూ.10,000 జరిమానాతో పాటు జైలుశిక్ష ఉంటుందని హెచ్చరించింది.