ఉక్రెయిన్ ను ఆయుధ రహితంగా చేయాలనే లక్ష్యంతో రష్యా తన యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, మైకొలైవ్ తో పాటు పలు నగరాల్లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. రాకేట్ లాంఛర్లతో ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతుంది. అయితే ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఆపడానికి రెండు దేశాల బృందాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు గా శాంతి చర్చలు జరిగినా.. ఫలితం లేకపోయింది.
తాజా గా సోమవారం బెలారస్ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఇరు దేశాల బృందంలోని సంభ్యులు తెలిపారు. అయితే ఉక్రెయిన్ లోని మానవతా కారిడార్ల ఏర్పాటు కు ఈ శాంతి చర్చల్లో కాస్త పురోగతి వచ్చిందని ఉక్రెయిన్ ప్రతినిధులు తెలిపారు.
అలాగే కాల్పులు విరమణ తో పాటు భద్రతా పరమైన హామీల కోసం రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కాగ ఈ చర్చలపై రష్యా ప్రతినిధులు.. రాజకీయంగా, సైనిక అంశాల పరంగా చర్చలు జరిపామని తెలిపారు. అయితే ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు.