ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలు ఎన్నో ఆంక్షలు విధిస్తున్నా… తాము మాత్రం తగ్గదే లేదు అని అన్ని దేశాలకు తమ ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని కీవ్, ఖార్కీవ్, సుమీ, మరియోపోల్ వంటి నగరాలను మసిదిబ్బలుగా మార్చింది. ఇన్నాళ్లు కీవ్ ను సొంతం చేసుకుందాం అనుకున్న రష్యాకు సాధ్యపడకపోవడవంతో మళ్లీ యుద్ధ వ్యూహాన్ని మార్చింది. ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి దాడులను పెంచింది.
ఇదిలా ఉంటే రష్యాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో జర్మనీ ఎప్రిల్ 4న రష్యాకు చెందిన 40 మంది దౌత్య సిబ్బందిని బహిష్కరించింది. దీన్ని తీవ్రంగా పరిణించిన రష్యా కూడా జర్మనీకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. జర్మనీపై ప్రతీకారచర్యకు దిగింది రష్యా. జర్మనీకి చెందిన 40 మంది దౌత్య సిబ్బందిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జర్మన్ రాయబారికి రష్యా సమన్లు పంపింది. ఇప్పటికే పలు దేశాలతో రష్యా ఇలానే చేసింది. పాశ్చాత్య దేశాలు రష్యా వ్యాపారాలను, వ్యాపారులపై నిషేధం విధించాయి. దీంతో రష్యా కూడా ఆదేశాలపై ప్రతీకార చర్యలు తీసుకుంది. గతంలో అమెరికా, యూకే వంటి దేశాలు తమ గగనతలం నుంచి రష్యా విమానాలపై బ్యాన్ విధించాయి. దీంతో రష్యా కూడా ఆయా దేశాల విమానాలను రష్యా గగనతలం నుంచి వెళ్లకుండా బ్యాన్ విధిస్తూ ప్రతీకారం తీర్చుకుంది.