UNO: ప్రపంచంలో 26% జనాభాకు స్వచ్ఛమైన తాగునీరు దూరం

-

ప్రపంచ జనాభాలో 26 శాతం మంది స్వచ్ఛమైన తాగునీటికి దూరమవుతున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 46 శాతం మందికి కనీస పారిశుద్ధ్యం అందుబాటులో లేదని తెలిపింది. 45 ఏళ్ల తర్వాత జలవనరులపై మొదటిసారిగా ఐరాస సుదీర్ఘ సదస్సు నిర్వహించింది. ఆ అంశాలను ప్రస్తావిస్తూ ‘ఐరాస ప్రపంచ జల అభివృద్ధి నివేదిక 2023’ను విడుదల చేసింది. సగటున ప్రపంచ జనాభాలో 10 శాతం మంది కటిక నీటి కొరత ఉన్న దేశాల్లో నివసిస్తుండగా, 350 కోట్ల మంది ప్రజలు ఏడాదికి కనీసం ఒక నెల నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నివేదిక ఒకటి వెల్లడించింది.

2030లోగా ప్రపంచ జనాభా మొత్తం శుద్ధ జలం, పారిశుద్ధ్యాన్ని పొందాలన్న లక్ష్యాలను చేరుకోవడానికి, ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి 600 బిలియన్‌ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్‌ డాలర్లు అవసరమని నివేదిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ రిచర్డ్‌ కానర్‌ వెల్లడించారు. పర్యావరణ మార్పుల కారణంగా మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియాలతో పాటు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొంటాయని తెలిపారు. పశ్చిమాసియా, సహారా పరీవాహక ప్రాంతాలు దుర్భర భవిష్యత్తు వైపు పయనిస్తున్నాయని ఈ నివేదిక హెచ్చరించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news