కరోనాపై పోరాటం విషయంలో పోలీసులు చేసే కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వేలాది మంది పోలీసులు నిత్యం కరోనా కట్టడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాలను వదిలి పోలీసులు నిత్యం కష్టపడుతున్నారు. దీనితో ప్రభుత్వాలు ఇప్పుడు వారి కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వారి ప్రాణాలకు చాలా వరకు ప్రాధాన్యత ఇస్తున్నాయి ప్రభుత్వాలు.
తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి సేవలను గుర్తించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. లాక్‌డౌన్ సమయంలో నిబద్ధతతో డ్యూటీలు చేస్తున్న పోలీసులకు బంపరాఫర్ ఇచ్చింది. ఒక్కో పోలీసుకు రూ.50లక్షల ఆరోగ్యబీమా అందించనున్నట్లు యోగి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రెటరీ అవానిష్ అవస్థి బుధవారం మీడియాకు వివరించారు.
ఈ నిర్ణయంపై త్వరలోనే సిఎం కార్యాలయం నుంచి రాతపూర్వకంగా ఉత్తర్వులు జారీ అవుతాయని వివరించారు. పంజాబ్ ప్రభుత్వం కూడా వారికి 50 లక్షల భీమా ప్రకటించింది. దీనిపై త్వరలోనే మరిన్ని రాష్ట్రాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.