కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండో రోజు వార్డు బాయ్ మృతి చెందడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిజానికి భారత వ్యాప్తంగా మొదటి రోజు చాలా మందికి కరోనా టీకాలు వేశారు. కానీ చాలా చోట్ల అస్వస్థతకు గురైన విషయాలు మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రిలో వార్డు బాయ్ మరణించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్న మహిపాల్ సింగ్ సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ తీసుకున్నాడని అంటున్నారు. అనంతరం ఆయనకు శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఛాతి నొప్పి రాగా దాని వలన ఆయన మరణించారని అంటున్నారు.
ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే మహిపాల్ సింగ్ మృతి చెందాడు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఆసుపత్రి మెడికల్ ఛీఫ్ మాట్లాడుతూ మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడని ఒకరోజు తర్వాత శ్వాస ఆడక ఛాతిలో నొప్పి వచ్చి బాధ పడ్డాడని అనంతరం మరణించాడని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న రోజే నైట్ షిఫ్ట్ చేశాడని ఆయన అన్నారు. అయితే సైడ్ ఎఫెక్ట్ కారణంగా మహిపాల్ సింగ్ మరణించినట్లు తాను భావించడం లేదని ఆయన మృతికి నిజమైన కారణం తెలుసుకునే పనిలో ఉన్నామని ఛీఫ్ పేర్కొన్నారు.