ప్రభుత్వం పేద ప్రజలకోసం పథకాలను తీసుకువస్తే ఆ పథకాలను అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు వాడుకుంటారు. ఏదో ఒక మాయ చేసి డబ్బులను పక్కదారి పట్టిస్తుంటారు. కాగా ప్రభుత్వం పేద ప్రజల కడుపునింపేదుకు తీసుకువచ్చిన ఉపాధిహామీ పథకం లోనూ అలాంటి అవకతవకలే జరుగుతుండటం నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంది. తాజాగా అలాంటి ఘటనే మరోటి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఏకంగా చనిపోయిన వ్యక్తులు బతికి వచ్చి పనులు చేసినట్టు చూపి నిధులను దోచుకున్నారు.
అనంతపురంలో ఉపాధిహామీ పనులలో అధికారులు ఇలా తమ అతి తెలివిని ప్రదర్శించారు. చనిపోయిన ఆరు నెలలకు వ్యక్తి బతికొచ్చి కూలి పని చేసినట్లు నమోదు చేశారు. నీరు పారే కాలువలో పూడిక తీత పనులను చేసినట్టు అధికారులు సృష్టించారు. అలాగే ఉపాధి పనులకు వెళ్లని వారి ఖాతాలలో కూడా డబ్బులు జమచేశారు. అనంతపురం లోని విడపనకల్లు మండలంలో ఇలా అతి తెలివిని ప్రదర్శించి రూ. లక్షల్లో అక్రమార్కులు దోపిడీ చేశారు.